Wednesday, 4 February 2015

Bhagavatham poem no. 43

సీ !!  ఎవ్వనియవతార మెల్లభూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు
        నెవ్వని శుభనామమేప్రొద్దునుడువంగ సంసారబంధంబు సమసిపోవు
        నెవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమొంది మృత్యువు పరువునెట్టు
         నెవ్వని పదనదినేపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధిగలుగు
తే !! తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరగుగాంచిరి వసుదేవదేవకులకు
        నెవ్వడుదయించె తత్కధలెల్ల వినగ నిచ్చపుట్టెడు నెఱగింపు మిద్దచరిత.

Meaning :

కలియుగములో మనవులనేకమైన బాధలకు లోనవుతారు. శ్రీ కృష్ణుని చరితము వినాలనే సత్సంకల్పము సర్వ శుభదాయకము. మానవులు శ్రీ హరి యొక్క కథలను వింటూ, ఆరాదిస్తూ, ధ్యానిస్తూ, ఉంటే సంసార బంధం నుండి విముక్తులు కాగలరు.    

Friday, 30 January 2015

కృతి సమర్పణ

కృతి సమర్పణ:
హారికి నందగోకుల విహారికి( జక్ర సమీర దైత్య సం
హారికి భక్త దుఃఖపరిహారికి గోపనితంబినీ మనో
హారికి దుష్ట సంపదపహారికి ఘ ొ షకుటీ పయోఘృతా
హారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్ !!
Meaning:

హారి, నంద గోకుల విహారీ, తృణా వర్థా రాక్షసుడిని సంహరించినవాడా!
భక్తుల దుఃఖాన్ని హరించు వాడా!
గొల్ల భామల మనుస్సులను దోచినవాడా!
దుష్ట సంపదలను అపహరించిన వాడా!
నంద గోకులము లోని ఇంటి లోని పాలు, వెన్న దొంగిలించి తిన్నవాడా!
పిల్లల పాలిటి పెను భూతమైన పూతన రాక్షసిని సంహరించినవాడా! ఓ శ్రీ కృష్ణ.

భాగవతములో చాలా శ్లోకాలు ఉన్నాయి. కాని దానిలో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే ఈ Blog లో ప్రస్తావిస్తున్నాను .  

Thursday, 29 January 2015

Pothana gari Bhagavatam

రామ గుణాభిరామ దినరాజకులాంబుధిసోమ తోయద
శ్యామ దశాననప్రబలసైన్య విరామ సురారిగోత్ర సు
త్రామ సూబాహు బాహు బలదర్పతమ: పటు తీవ్రధామ ని
ష్కామ కుభృల్లలామ గరకoట సతీనుత నామ రాఘవా !!

Meaning :

రామా,  గుణాభిరామ! సూర్యవంశ సాగరానికి చంద్రుని వంటి వాడా! నీలమేఘశ్యామా! రావణ సైన్యాన్ని అంతమొందించిన వాడా! పర్వతాల్లాంటి రాక్షసులను ఖండించే వజ్రాయుధ ధారీ! సూబాహువనే రాక్షసుడి బలదర్పం అనే అంధకారాన్ని అంతమొందించిన సూర్యుడి లాంటి వాడా! కోరికలు లేని వాడా! అవనీపతులలో అగ్రగణ్యుడా! పార్వతిచే స్తుతింప బడిన వాడా! రాఘవా! నీకు వందనములు. 

Wednesday, 28 January 2015

Pothana gari Bhagavatam

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన తమ్మిచూలికైన
విబుధ జనుల వలన విన్నoత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు !!

Meaning :

అయితే, చిత్రమే టoటే - శివుడే కానీ, బ్రహ్మ దేవుడే కానీ, ఈ భాగవత తత్త్వాన్ని చక్కగా, సమగ్రంగా చెప్పడానికి సమర్థులు కానప్పుడు, ఇక నాలాంటి సామాన్య మానవులుకు అది సాధ్యపడ్తుందా? అయినా, పెద్దలైన పండితుల నుండి విన్నుంత వరకు, నా మనో నేత్రానికి గోచరించినంతవరకూ, వాటిలో నాకు తెలియ వచ్చినంతవరకూ, వివరించిడానికి నేను ప్రయత్నిస్తాను.  

Tuesday, 20 January 2015

Pothana gari Bhagavatam

చేతులారంగ శివుని(   బూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగాదలపడేని
కలుగనేటికి తల్లులకడుపు  చేటు

శ్రీమద్భాగవత రచన గురించి

పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట నే
పలికిన భవహర మగునట
పలికెద వేఱొoడు గాధ పలుకగ నేలా

Meaning :

నేను చెప్పబోయేదేమో భాగవతమట, పరమ పవిత్రమైన ఆ మహాపురాణమును నా చేత చెప్పించే విభుడు సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్ర ప్రభువేనట, నేనీ భాగవత గాధను చెప్తే సంసార బంధం తొలిగిపోతుందట, అందుచేత నేనీ భాగవతాన్నే చెప్తాను. ఇంకొక గాధను చెప్పడమెందుకు ?  

Monday, 19 January 2015

Pothana gari Daivasthuthi Poem7 Maha Lakshmi

హరికిన్ పట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీగిరిసుతుల్ తోనాడు పూబోడి తా 
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా 
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్ !!

Meaning :

శ్రీహరికి పట్టపు దేవియైన శ్రీదేవి, పుణ్యాల దీవి, సిరిసంపదల పెన్నిధి, చంద్రుని సోదరి, వాణీ శర్వాణులతో క్రీడించే పూబోణి, అరవింద మందిర, ముల్లోకాల్లోనూ పూజనీయురాలు, వెలుగు వీక్షణముతో దారిద్ర్యాన్ని తొలగించే తల్లియైన శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కల్యాణాలను, అనుగ్రహించుగాక!

Sunday, 18 January 2015

Pothana gari Daivasthuthi Poem6 Durga Bhavani

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ !!

Meaning :

అమ్మలందరికి అమ్మ, ముగ్గురమ్మలకూ మూలమైన అమ్మ, అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ, అసురుల అమ్మ కడుపునకు చిచ్చు పెట్టిన అమ్మ, తన్ను మనస్సులో నమ్ముకొన్న దేవతల తల్లులయొక్క చిత్తములలో నిల్చియుండే అమ్మ, దయాజలనిధి అయిన మాయమ్మ దుర్గ భవాని నాకు మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలు నిచ్చు గాక !