Tuesday, 20 January 2015

Pothana gari Bhagavatam

చేతులారంగ శివుని(   బూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగాదలపడేని
కలుగనేటికి తల్లులకడుపు  చేటు

శ్రీమద్భాగవత రచన గురించి

పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట నే
పలికిన భవహర మగునట
పలికెద వేఱొoడు గాధ పలుకగ నేలా

Meaning :

నేను చెప్పబోయేదేమో భాగవతమట, పరమ పవిత్రమైన ఆ మహాపురాణమును నా చేత చెప్పించే విభుడు సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్ర ప్రభువేనట, నేనీ భాగవత గాధను చెప్తే సంసార బంధం తొలిగిపోతుందట, అందుచేత నేనీ భాగవతాన్నే చెప్తాను. ఇంకొక గాధను చెప్పడమెందుకు ?  

Monday, 19 January 2015

Pothana gari Daivasthuthi Poem7 Maha Lakshmi

హరికిన్ పట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీగిరిసుతుల్ తోనాడు పూబోడి తా 
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా 
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్ !!

Meaning :

శ్రీహరికి పట్టపు దేవియైన శ్రీదేవి, పుణ్యాల దీవి, సిరిసంపదల పెన్నిధి, చంద్రుని సోదరి, వాణీ శర్వాణులతో క్రీడించే పూబోణి, అరవింద మందిర, ముల్లోకాల్లోనూ పూజనీయురాలు, వెలుగు వీక్షణముతో దారిద్ర్యాన్ని తొలగించే తల్లియైన శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కల్యాణాలను, అనుగ్రహించుగాక!

Sunday, 18 January 2015

Pothana gari Daivasthuthi Poem6 Durga Bhavani

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ !!

Meaning :

అమ్మలందరికి అమ్మ, ముగ్గురమ్మలకూ మూలమైన అమ్మ, అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ, అసురుల అమ్మ కడుపునకు చిచ్చు పెట్టిన అమ్మ, తన్ను మనస్సులో నమ్ముకొన్న దేవతల తల్లులయొక్క చిత్తములలో నిల్చియుండే అమ్మ, దయాజలనిధి అయిన మాయమ్మ దుర్గ భవాని నాకు మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలు నిచ్చు గాక !

Friday, 16 January 2015

Pothana gari Daivasthuthi Poem5 Talli Bharati

శారద నీరదేందు ఘనసార పటీర మరాళమల్లికా
హారతుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది( గానగ నెన్నడు కల్గు భారతీ !!

Meaning :

శరన్మేషు మధ్య చంద్ర బింబమూ, కర్పూరము, స్పటికమూ, రాజ హంసలు, మల్లికలు, మంచు, నురుగు, వెండి కొండ, ఆది శేషువు, కుంద మందారాలు, పాల సముద్రము, పద్మ పుష్పము, ఆకాశ గంగల వలె స్వచ్ఛమై శుభాకారముతో నున్న నీ యొక్క సుందర మూర్తిని మదిలో నెప్పుడు చూడగలనో తల్లీ, భారతీ ! 

Tuesday, 13 January 2015

Pothana gari Daivasthuthi Poem4 Vinayaka

ఆదరమొప్ప మ్రోక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికి( బ్రపన్న వినోదికి విఘ్నవల్లికా
చ్చేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్
మోదకఖాదికిన్ సమద ముషక సాదికి సుప్రసాదికిన్ !!

Meaning :

హిమగిరి నందిని యొక్క హృదయానురాగాన్ని పొంది, కలి దోషాలను తొలగించి, ప్రపన్నుల నానందింపజేసి, ఆశ్రితుల   విఘ్నలతలను ఛేదించి, మధుర భాషణములు చేసి, అశేష జనులను ఆనందింప జేసి, మొదకాలను, ఆరగించి, మూషికమును అధిరోహించి, ముదమును కలిగించే వినాయక దేవునకు మ్రొక్కుతున్నాను. 

Saturday, 10 January 2015

Pothana Daivastuthi poem3 Brahma

ఆతతసేవసేసెద సమస్త చరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
ర్లేతకు దేవతానికర నేతకు( గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ !!

Meaning :

చరాచర ప్రపంచాన్నంత చక్కగా సృష్టించు వాడు, సరస్వతీ స్వాంతానికి సంతోషం చేకూర్చెడి వాడు, వేదాలనన్నింటిని సమర్థంగా సమకూర్చిన వాడు, నాయకుడై దేవతలను ఆదుకొనేవాడు కల్మషాన్ని జయించిన వాడు, ఆశ్రితులను ఆదుకొనే వాడు, తపోధనులకు శుభాలను కలిగించు వాడు అయిన, బ్రహ్మ దేవుని నేను శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నాను. 

Friday, 9 January 2015

sri madhbhagavatam - Pothana gari Daivastuthi poem 2 Eswara

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవకేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మ మయూఖమాలికిన్
బాలశశాంక మౌళికి( గపాలికి మన్మధ గర్వపర్వతో
న్మూలికి నారదాదిముని ముఖ్య మన: సరసీరుహాళికిన్

Meaning :

చేతిలో త్రిశూలమును, మెడలో కపాల మాలను, శిరస్సున నెలవంకను, ధరించి, లీలా తాండవలోలుడైన పరమ శివునకు శిరస్సు వంచి, భక్తి పూర్వకంగా ప్రణామము చేస్తున్నాను. కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్పదర్పహరుడు, పర్వత రాజు పుత్రి యొక్క ముఖ పద్మాన్ని ప్రపుల్లం కావించే ప్రభాకరుడు. నారదాది ముని సత్తముల చిత్త కమలములలో విహరించే మధుకరుడు.

Poet Pothana praises Lord Krishna, so I have kept heading Daivastuthi